Buddha and his Teachings

 

ఒకసారి గౌతమబుద్ధుడు తన శిష్యులతో కలిసి ఓ గ్రామానికి వెళ్లాడు. సిద్ధార్థుడి బోధనలు వినడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. 


తనకు తెలిసిందే జ్ఞానం, తాను చెప్పేదే వేదమని విర్రవీగుతున్న ఆ గ్రామ పండితుడికిది నచ్చలేదు. గౌతముడ్ని అవమానించాలనుకున్నాడు. 


ఒకరోజు సిద్ధార్థుడు శిష్యులతో కలిసి భిక్షాటనకు వెళ్లగా ‘నువ్వేం దేవుడివి? నిన్ను చూడటానికా ఈ పిచ్చిజనం వస్తోంది?!’ అన్నాడు పండితుడు హేళనగా. 


🌿దానికి బుద్ధుడు ‘నేను దేవుడ్ని కాదు నాయనా! నీలానే సాధారణ మనిషిని. జనం నాకోసం కాదు, ధర్మంకోసం వస్తున్నారు’ అని బదులిచ్చాడు. 


దానికి పండితుడు ‘నువ్వేదో గొప్ప జ్ఞానివటగా! నీ పాండిత్యమేంటో చూద్దాం. నాతో వాదించి గెలువు! ఈ సన్యాసులు ప్రజల్ని మోసం చేయడానికి తప్ప ఇంక దేనికీ పనికిరారు’ అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.


🌿తథాగతుడు చిరునవ్వుతో ‘నాయనా! వాదనతో మనశ్శాంతిని కోల్పోవడం తప్ప దేన్నీ గెలవలేం. ఇక వాదనలెందుకు?’ అన్నాడు. 


దాంతో పండితుడికి మరింత కోపం వచ్చింది. ‘మూర్ఖుడా! నాకే నీతులు చెబుతావా?’ అంటూ తన కాలి చెప్పును బుద్ధుడి వైపు విసిరాడు. అది ఆయన భిక్షపాత్రలో పడింది. శిష్యులకు, చుట్టుపక్కల ప్రజలకు కోపం వచ్చింది. కానీ సిద్ధార్థుడు అంతే ప్రశాంత చిత్తంతో ‘నాయనా! ఒక చెప్పుతో నడవటం నీకు కష్టమవుతుంది. రెండో చెప్పును కూడా ఇస్తే పాదరక్షలు లేనివాడికి నీ పేరుతో ఇస్తాను’ అన్నాడు. పండితుడికి జ్ఞానోదయమైంది. ‘ఇది కదా స్థితప్రజ్ఞత. 


ఈయన సామాన్యుడు కాదు, మహాపురుషుడే’ అనుకుని బుద్ధుడి కాళ్లపైపడి క్షమించమని వేడుకున్నాడు. 


👉గౌతముడు ‘నీ చదువు, జ్ఞానం నలుగురికీ మేలుచేయాలే కానీ వాదనలెందుకు? దానివల్ల మిగిలేది అశాంతే! అది నీకూ సమాజానికీ కూడా మంచిది కాదు’ అన్నాడు. 


పండితుడిలో అప్పటిదాకా ఉన్న అశాంతి పోయి ఆనందం కలిగింది.


No comments:

Post a Comment