*'మే' డే.. ఎంతో ఉత్తేజపూరితమైన రోజు..*
*ఎనిమిది గంటల పని దినం కోసం*
*లక్షలాది కార్మికులు రక్తం చిందించిన రోజు.*
*నెత్తుటి జెండాలు ఎగిసిన రోజు..*
*అటువంటి ముఖ్యమైన రోజు*
*ఇప్పుడు మసకబారుతోంది.*
'పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప' అని మార్క్సిస్ట్ మహోపాధ్యాయుడు కారల్ మార్క్స్ నాడు ప్రవచిస్తే నేడు ఎక్కడికక్కడ రాజీ పడే,సర్దుకు పోయే నయా ఉదారవాద వర్గం తయారైంది.అమర వీరుల త్యాగాల్ని అపహాస్యం చేసే దుస్థితికి తీసుకు వచ్చింది.
*అసలింతకీ ఈ మేడే ఏంటీ?*
*ఉరితీయబడ్డ ఆ శిరస్సులు చెప్పిన రహస్య మేమిటీ?*
*19వ శతాబ్దం..పారిశ్రామిక విప్లవాల కాలం..*
పని గంటల్లేవు.. హక్కుల్లేవ్.. ఉదయాల్లేవ్.. ఉషస్సుల్లేవ్.అమ్మెవరో,అబ్బెవరో పిల్లలకు తెలిసే స్థితి లేదు.24 గంటల్లో 14, 15 గంటల పని. దుర్భరం.. పొద్దున పనికెళ్లిన వాళ్లు ఎప్పుడు తిరిగొస్తారో,అసలు వస్తారో రారో తెలియదు.. వందలు,వేల మంది చచ్చి శవాలవుతారు.దీనికి ముగింపెట్లా? ఎవరు,ఎలా,ఏమి చేయాలి?
*ఆ ఆలోచనే 1884 అక్టోబర్ 7న చికాగో సదస్సు.*
సంఘటిత వాణిజ్య వ్యాపార సంస్థల కార్మికసంఘాల సమాఖ్య (ఆ తర్వాత ఇదే అమెరికా కార్మిక సమాఖ్య -ఏఎఫ్‌ఎల్) ఇందుకు నడుం కట్టింది.8 గంటల పని దినమని నినదించింది.అమెరికా,కెనడా ప్రభుత్వాల కు రెండేండ్ల గడువిచ్చింది.1886 మే 1 నుంచి అమలు చేయాలని అల్టిమేటం ఇచ్చింది.లేకుంటే సమ్మేనని హెచ్చరించింది.ప్రపంచ దేశాల్లోని సోదర కార్మిక సంఘాలకూ ఈ సందేశం పంపింది.అప్పటికే ఆస్ట్రేలియా కార్మికవర్గం-8 గంటల పని,8 గంటల వినోదం,8 గంటల విశ్రాంతి -నినాదాన్ని అందుకుంది. లండన్, ప్యారిస్ వంటి యూరోపియన్ నగరాలు 8 గంటల పని దినం కోసం గొంతెత్తాయి.
1886, ఉదయం 10 గంటలు.. అమెరికా అంతటా సమ్మె.13 వేల సంస్థల మూత.. వీధుల్లో 3 లక్షల మంది కార్మికులు... అంతకంతకూ పెరిగిన సమ్మె హోరు.. 24 గంటల్లో సమ్మె చేస్తున్న కార్మికుల సంఖ్య 4 లక్షలకు చేరింది. కార్మికోద్యమానికి పురిటిగడ్డ చికాగో.. ఆ ఒక్క నగరంలోనే 40 వేల మంది కార్మికులు,భార్యాబిడ్డలతో ర్యాలీ.. బ్యానర్లు, ఎర్రజెండాల రెపరెపలు.. మిన్నంటిన నినాదాలు.. హోరెత్తిన ప్రసంగాలు.. వీధులు మార్మోగాయి. దిక్కులు పిక్కటిల్లాయి.ప్రభుత్వాలు బెంబేలెత్తాయి. పరిశ్రమల యజమానుల గుండెల్లో దడ..తొలి రోజు ముగిసింది.మర్నాటికి ఉధృతి మరింత పెరిగింది. రాత్రికి రాత్రే పాలకుల కుట్రలు, కుయుక్తులు.. ప్రశాంత ర్యాలీలపై ఉక్కుపాదం మోపేలావ్యూహాలు..
*మే 3..1886..మధ్యాహ్నం..*
కార్మికవర్గం అంతిమ విజయం సాధించే వరకు ప్రతిఘాత శక్తుల్నీ ఎదుర్కోవాల్సిందే కదా.. ఈ వేళ జరిగిందదే. హే మార్కెట్ నుంచి ప్రదర్శన మెక్ కార్మిక్ రీపర్ వర్క్స్ వద్దకు చేరింది. పెట్టుబడిదారులు కన్ను గీటారు.. పోలీసులు బంధూకులు దూశారు.రెచ్చి పోయి కాల్పులు జరిపారు.ఆరుగురు కార్మికులు నేలకొరిగారు.మంది నెత్తుటి మడుగుల్లో గిలగిల లాడారు. ఈ ఘాతుకాన్ని సంఘం నిరసించింది. మర్నాడు ర్యాలీ జరపాలని నిర్ణయించింది.
*మే 4..1886. సాయంత్రం.. రక్తం ఏరులైన రోజు..*
హే మార్కెట్, రాన్‌డాల్ఫ్ స్ట్రీట్ (175 ఎన్.డెస్ ప్లెయిన్స్ స్ట్రీట్) కిక్కిరిసింది. కబడ్దార్..మమ్మల్నే కాల్చి చంపుతారా? కార్మికుల ఆగ్రహావేశాలు, నాయకుల సముదాయింపు.. మీటింగ్ మొదలైంది.
ఓ వ్యాగన్‌నే వేదిక చేసుకున్న నాయకులు ప్రసంగాలు చేశారు. చివరి వక్త ఆగస్ట్ స్పైస్ సభను ముగించ బోతున్నారు. ఇంతలో కలకలం. లాభాలు తప్ప ఇంకేమీ పట్టని పెట్టుబడిదారులు,పరిశ్రమాధిపతుల కోర్కె నెరవేరింది. ఖాకీలు కయ్యానికి కాలుదువ్వారు. కార్మికులపై విరుచుకు పడ్డారు.లాఠీలతో కుళ్లబొడిచారు.
తుపాకులతో నెత్తురు కళ్ల జూశారు.
సరిగ్గా ఆ సమయంలో జనంపై బాంబు.. ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు విసిరారో తెలియదు.ఒక సార్జెంట్ మృతి.. కార్మికులు, పోలీసుల బాహాబాహీ. ఎందరికి తలలు పగిలాయో, మరెందరి కాళ్ళూ చేతులు తెగిపడ్డాయో లెక్కలేదు.సభాస్థలి రక్తసిక్తం.. యుద్ధ రంగాన్ని మించిన బీభత్సం. ఏడుగురు పోలీసులు, 8 మంది కార్మికులు చచ్చిపోయారు.హే మార్కెట్ ప్రాంతం కార్మికుల రక్తంతో తడిసి ముద్దయింది.చికాగో నగరం స్తంభించింది. యజ మానుల లక్ష్యం నెరవేరింది.15 మంది కార్మిక నేతలపై కేసు నమోదైంది. 8 గంటల పనని అరవడమే నేరమైంది.వీళ్లలో 8 మందిని అరాచక వాదులుగా ముద్ర వేశారు.
అమ్ముడు పోయిన 1886 ఆగస్టులో విచారణ మొదలైంది.జ్యూరీ డబ్బున్న వాళ్లకు చుట్టమైంది. అమెరికా సహా ప్రపంచ దేశాల కార్మికవర్గం ముక్త కంఠంతో ఈ విచారణను నిరసించింది. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా? ఆ 15 మందిలో ఏడుగురికి ఉరిశిక్ష, మిగతా 8 మందికి 15 ఏండ్ల కఠిన కారాగారా శిక్ష.1886 చివర్లో నలుగురు నాయకులు -పార్సన్స్, స్పైస్, ఫిషర్, ఏంజిల్‌ను ఉరితీశారు.ఒక నాయకుడు జైల్లోనే నోట్లో పేలుడు పదార్ధం ఉంచుకుని పేల్చేసు కున్నాడు.జ్యూరీ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో మిగతా ముగ్గురికి క్షమాభిక్ష పెట్టారు.ఆరేండ్ల తర్వాత విడుదల చేశారు.
ఈ ఉరితీతలు ప్రపంచాన్ని కుదిపేశాయి.
*మే డేను ప్రకటించిన రెండో ఇంటర్నేషనల్...*
కమ్యూనిస్టులు,లేబర్ పార్టీలు,ఇతర ప్రగతిశీల శక్తులతో ఫస్ట్ ఇంటర్నేషనల్ ఏర్పాటైంది.అది 1876లో రద్దయింది.తిరిగి రెండో ఇంటర్నేషనల్ 1889లో మొదలైంది.ఈ సంస్థే మే-1ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా,మార్చి8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. హే మార్కెట్ అమరవీరుల త్యాగానికి తర్పణాలు పట్టింది. వారి త్యాగాన్ని కీర్తిస్తూ 1890 మే1న ర్యాలీలు జరపాలని పిలుపిస్తే ఒక్క లండన్‌లోనే మూడు లక్షల మందితో ప్రదర్శన జరిగింది. ప్రపంచం నివ్వెర పోయింది. ఆ తర్వాతే కార్మిక వర్గ చరిత్రలో మే డే భాగమైంది. 66 దేశాలు అధికారికంగా, మరి కొన్ని అనధికారిక సెలవు ఇస్తున్నాయి.కానీ,ఎక్కడైతే పోరు ప్రారంభమైందో ఆ దేశమైన అమెరికా మాత్రం ఇప్పటికీ మే డేని గుర్తించలేదు.(సెప్టెంబర్‌లో వచ్చే తొలి శుక్రవారాన్ని అమెరికా లేబర్ డేగా ప్రకటించింది. మే1ని న్యాయ దినోత్సవంగా ప్రకటించింది.)
*హే మార్కెట్ ఇప్పుడెలా ఉందంటే..*
2021 మార్చి 9.. మంగళవారం సాయంత్రం 6.40 గంటలు.. వణికిస్తున్న చలి.హోరెత్తుతున్న గాలి.. చికాగోలోని మేడే స్మారక స్థూపాన్ని చూడాలన్న కోర్కె నెరవేరిన రోజు.డౌన్ టౌన్‌లోని 175 ఎన్.డెస్ ప్లెయిన్స్ స్ట్రీట్.కార్మికుల రక్తంతో తడిసిన హేమార్కెట్ ప్రాంతమదే.తలెత్తి చూస్తే తప్ప ఏ బిల్డింగ్ ఎంతుందో చెప్పలేం.పెద్దగా రద్దీ లేదు.అడపా దడపా వచ్చి పోయే వాహనాలు తప్ప..ఆ స్థూపాన్ని చూడడంతోనే - మేడే నేడే పాట చేవుల్లో మార్మోగింది.తెలియ కుండానే పిడికిళ్లు బిగుసుకు పోయాయి.చెయ్యెత్తి జైకొట్టా..జోహార్లు అర్పించా.
*పోరు జరిగిన ప్రాంతంలో స్థూపం ఇలా....*
నాడు కార్మిక నాయకులు ఓ వ్యాగన్ ఎక్కి ప్రసంగించారు.దాన్ని స్ఫూర్తితో మేరీ బ్రొగ్గర్ అనే శిల్పి ఈ స్థూపాన్ని తయారు చేశారు.హే మార్కెట్ దాడిని స్పురించేలా ఉంటుంది.భావప్రకటనా స్వేచ్ఛ,సభలు జరుపుకునే హక్కు,కార్మికులు సంఘటితమయ్యే స్వేచ్ఛ,8గంటల పనిదిన పోరు,చట్టం,న్యాయం..ఇలా మానవ హక్కుల్లోని ప్రతి కోణాన్నీ ఈ స్థూపం ఆవిష్కరిస్తుంది.ఒక వీరుడు నేెలకొరుగుతుంటే మరో వీరుడు ఆదుకునేలా,కార్మిక శక్తే పునాదిగా నిర్మించిన వేదికపై ముగ్గురు నాయకులు నినదిస్తున్నట్టుగా ఈ చిత్రం ఉంటుంది.
*ఫారెస్ట్ పార్క్‌లో తొలి స్థూపం..*
హే మార్కెట్ విషాద ఘట్టం ప్రపంచ వ్యాప్తంగా ఎందరెందర్నో కదిలించింది.ఎవరికెలా తోస్తే అలా నివాళులు అర్పించారు.కొందరు స్మారక చిహ్నాలు వేశారు.మరికొందరు పోస్టర్లు వేశారు.ఇంకొందరు శిల్పాలు చెక్కారు.తనివి తీరని వారు గోడల మీద చిత్రాలు వేశారు.1893లో హే మార్కెట్ అమరవీరుల మాన్యుమెంట్ చికాగో శివార్లలోని ఫారెస్ట్ పార్క్ శ్మశానంలో ఏర్పాటయింది.ఇదే తొలి స్థూపం.'మీరు ఈవేళ మా గొంతునులిమారు సరే.కానీ మా మౌనం విస్పోటనంలా వినిపించే రోజొకటి వస్తుంది'అని ఆ స్థూపం శిలాపలకంపై ఉంటుంది.
*కార్మికుల పోరాట శక్తి ఏమైందీ?చరిత్ర పునరావతమవుతుందట..*
ప్రపంచీకరణ,సోషలిస్టు పతనం,విభజించు పాలించు తీరు,ధన ప్రవాహం,అవతలి వాళ్లను తొక్కయిన సరే పైకి ఎదగాలనుకునే కెరియరిజం..ఇలా వీటన్నిటి మధ్య పని గంటల ఊసే ఆవిరైంది.చివరకు కార్మిక సంఘం ఏర్పాటు చేసుకునే హక్కుకూ కష్టకాలం వచ్చింది.
ఇండియాలో 44 కార్మిక చట్టాలు కాలగర్భంలో కలిసి పోతున్నాయి.ప్రతిష్టాత్మక ప్రభుత్వరంగ పరిశ్రమలు కార్పొరేట్ సంస్థల పరమవుతున్నాయి.అవినీతి, బంధుప్రీతి,ఆశ్రితపక్షపాతం ఆశ్రితపెట్టుబడిదారితనం రాజ్యమేలుతోంది.బి.ఎస్.ఎన్.ఎల్,ఎల్‌ఐసీ,ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు,రైల్వే వంటి లాభసాటి సంస్థల్ని ఇప్పటికే అమ్మకానికి పెట్టారు.
వ్యాపారాల పేరిట వందల వేల కోట్లు రుణాలు తీసుకుని బ్యాంకులకు నామం పెట్టి విదేశాలకు చెక్కేస్తున్నా,బ్యాంకుల్ని దివాలా తీయిస్తుంటే ప్రతిఘటించాల్సిన కార్మిక వర్గం ప్రేక్షకపాత్రకు పరిమితం కారాదు.అదంతా ఈ దేశ శ్రామిక వర్గం సాధించిన ఉత్పత్తి సంపదల ప్రతిఫలం కదా?
కానీ కార్మికవర్గ పోరాట స్వభావాన్ని,చైతన్యాన్నీ దెబ్బతీయడానికి పాలకపక్ష సహకారం పొందడంలో నయా పెట్టుబడిదారీ వర్గం విజయం సాధించింది. పాలకుల పలుకుబడి ముందు కొండకచో న్యాయ వ్యవస్థ సైతం కళ్లకు గంతలు కట్టుకుంది.
దీనికి ముగింపు ? కార్మిక వర్గ కల్యాణం ఎప్పుడు? అందుకోసం తలపెట్టే సమస్త ఉద్యమాల్లో కార్మిక, కర్షక,అణగారిన బడుగు,బలహీన వర్గాలు చేయి చేయి కలిసినడిచేది ఎన్నడో..నయా బానిసత్వానకి ముగింపు పలకాలి.అందుకు స్ఫూర్తిగా చికాగో అమర వీరులకు జోహార్లు.🚩
No comments:
Post a Comment